తెలంగాణ

పార్టీ వీడితే.. క్రిమినల్‌ కేసు పెట్టండి

కరీంనగర్‌ పట్టణం: తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఒక అఫిడవిట్‌ ద్వారా ప్రకటించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాండు ద్వారా తన అఫిడవిట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు చాలా మంది తెరాసలో చేరారని, నిన్ను గెలిపించినా అదే పని చేస్తావా? అని కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నించారని.. అందుకే తాను ఈ పని చేసినట్లు తెలిపారు. ఒకవేళ పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో తనపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసు కూడా పెట్టవచ్చని, ఈ అఫిడవిట్‌ ప్రతులను లోక్‌సత్తా, అనేక స్వచ్ఛంద సంస్థలకు, ప్రజా సంఘాలకు పంపిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల్లో భాజపాపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌, వినోద్‌కుమార్‌లు ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీతో జతకట్టమని అఫిడవిట్‌ ద్వారా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వినోద్‌కుమార్‌ గెలిస్తే మంత్రి అవుతారని అంటున్న కేటీఆర్‌ ఏ పార్టీ ప్రభుత్వం ద్వారా మంత్రి అవుతారో చెప్పాలని కోరారు.

Comment here