Sliderఆంధ్రప్రదేశ్భక్తి

నిండా.. నాణేల కొండ!

తిరుపతి: పాత నాణేలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2014 జనవరిలో ప్రకటించింది. పావలా నాణేలు అప్పటికే తితిదే వద్ద భారీగా ఉన్నాయి. ముఖ్యంగా పావలాను స్టీల్‌తో తయారు చేయించారు. తితిదే మూటల్లోనే మగ్గిన పాత నాణేలను ఆర్‌బీఐకు పంపి… మార్చుకోవడంలో అప్పటి తితిదే అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఇప్పుడు అవి 90 టన్నుల వరకు ఉండిపోయాయి. ప్రస్తుతం వీటిని తమిళనాడులోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు ఇచ్చి నాణేలు కరిగించాలని తితిదే భావిస్తోంది. సెయిల్‌ దీనికి బదులుగా డబ్బు ఇచ్చేందుకు అంగీకరించలేదు. టన్నుకు రూ.27 వేల విలువ కట్టి.. ఆ మేర తితిదేకు లడ్డూ ట్రెలను ఇచ్చేందుకు అంగీకరించింది. 2011లోనే కేంద్రం నాణేలను కరిగించకూడదని, అలా కరిగిస్తే 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు తితిదే ఆర్‌బీఐ వద్ద అనుమతి తీసుకొని మరీ సెయిల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

• ఇక్కడే మరోకొత్త చిక్కు వచ్చి పడింది. పావలా నాణేలను పాత నాణేలను సేకరించే పలు సంఘాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. టన్నుకు రూ.88లు ఇచ్చేందుకు వారు సిద్ధం అవుతున్నారు. దీంతో పాటు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదు. ఇక సెయిల్‌కు ఇస్తే రూ.24.30 లక్షలు వస్తే.. అది పాత కాయిన్లు కలెక్ట్‌ చేసుకునే సంఘాలు తమకు ఆ పావలా కాయిన్లు ఇస్తే రూ.79.20లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. అంటే సుమారు రూ.55లక్షలను తితిదే వద్దనుకుంటోంది. వీటికి కనీసం టెండర్లు పిలిస్తే… ఆసక్తిగల వారు వస్తారని, అలా చేయకపోవడంపై తితిదేపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

●• హుండీలో పడే ప్రతి వస్తువు చివరకు స్వామి మాల వేసుకునే అయ్యప్పభక్తులు హుండీలో వేసే కాపర్‌ను సైతం తితిదే అమ్మకానికి పెడుతోంది. వేలం నిర్వహించి దాన్ని గుత్తేదారులకు ఇస్తోంది. మరి మూలనపడి ఉన్న నాణేలను ఇవ్వడంలో తితిదే ఎందుకు వెనకడుగు వేస్తోందన్నది నాణేల సేకరణదారుల ప్రశ్న. దీనిపై కనీసం తితిదే కౌంటర్లలో వీటిని అమ్మినా…. అధికమొత్తం పోసి కొనుగోలు చేసేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారని వారు చెబుతున్నారు.

• రూపాయి, రూ.2, రూ.5, రూ.10 నాణేలు పరకామణిలు రూ.30 కోట్లు, ఎస్వీ విశ్వవిద్యాలయం చెస్ట్‌లో రూ.20 కోట్లు ఉన్నాయి. ఇక పైసా, ఐదు, పది పైసలు, 20 పైసలు వంటి అల్యూమినియం నాణేలు సైతం 150 టన్నులు తితిదే ఖజానాలో ఉన్నాయి. వీటి ముఖ విలువ రూ.కోటి వరకు ఉంటుంది. ఇక వీటిని అలాగే నిల్వ ఉంచుతోంది.. తప్ఫ.. ఏం చేయాలనే దానిపై తితిదేకు స్పష్టత లేదు. ఇవి అల్యూమినియం కావడంతో చాలావరకు నాణేలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాని స్థితికి చేరుకుంటున్నాయి.

• వీటికి తోడు విదేశీ నాణేలు మయన్మార్‌, సింగపూర్‌, జపాన్‌లకు చెందిన పలు విదేశీ నాణేలు తితిదే వద్ద ఉన్నాయి. ఇవి సుమారు 110 టన్నుల వరకు ఉంటాయి. కొన్ని దేశాల్లో మారకం నిషేధించిన నాణేలు సైతం తితిదే వద్ద మగ్గుతున్నాయి. ఆయా దేశాల్లో కనీసం మారకంలో లేని వాటిని తితిదే అలాగే ఉంచుకుంది. కనీసం వాటిని

ఎప్పటికప్పుడు మార్చుకోవడంపైనా దృష్టి లేదు.

●గతంలో తితిదే పరకామణి నుంచి వివిధ బ్యాంకులకు చిల్లర వెళ్లేది. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల బిళ్లలను విడివిడిగా ఎంచి… మూటలుగా కట్టి బ్యాంకులకు పంపేవారు. వాటి విలువ ప్రకారం బ్యాంకులు డబ్బులు చెల్లించేవి. వాటిని వ్యాపారులకు ఇచ్ఛి.. బ్యాంకులు కమీషన్‌ పొందేవి. బ్యాంకులకు కలిగే లాభంపై తితిదే తగిన సేవలు అందిస్తుండేవారు. ఇప్పుడు కేవలం స్టేట్‌ బ్యాంకుకు మాత్రమే చిల్లరను ఇస్తున్నారు. ఇప్పటికే ఎస్వీ విశ్వవిద్యాలయం చెస్ట్‌ మొత్తం పరాకామణి చిల్లరతో నిండిపోయింది. దీంతో వారు కూడా చిల్లరను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.

• పరకామణి నుంచి ఏరే చిల్లరను రోజువారీ హుండీ ఆదాయంలో చూపించరు. నాణేలను వేరు చేసి… కేవలం బరువు ఆధారంగా మాత్రమే నాణేలను మూటలు కట్టి బయటకు పంపుతారు. ఇక్కడ సైతం మతలబు జరుగుతోందనేది ప్రధాన ఆరోపణ. కొన్ని రూపాయి మూటల్లో… రూ.10, రూ.5ల నాణేలను పెట్టి భారీగా నింపుతున్నారని, పైకి గోనె సంచిపై రూపాయి నాణేల మూటా అని రాసున్నా, దాని నిండా వేర్వేరు కాయిన్లు కనిపిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బ్యాంకుకు నాణేలను ఇచ్చే అవుట్‌ సోర్సింగు ఉద్యోగులు, తితిదేలోని కొందరు ఉద్యోగులు కుమ్మక్కయ్యారనేది ప్రధాన ఆరోపణ.

• నాణేలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం, తరలించడంలో తితిదే ఆర్థిక విభాగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో టన్నులకు టన్నులు నాణేలు ఎప్పుడూ తితిదే వద్ద లేవు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చేవారు. అయితే గత కొంతకాలంగా వీటిని తరలించడంలో ఆర్థిక విభాగంలోని అధికారులు ఆసక్తి చూపడం లేదు.

మేం తీసుకుంటాం: చంద్రశేఖర్‌, తిరుపతి కాయిన్‌ కలెక్షన్‌ అసోసియేషన్‌

తితిదే వద్ద ఉన్న నాణేలను మేం తీసుకునేందుకు సిద్ధం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1.50 లక్షల నాణేల సేకర్తలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా లక్షల్లోనే వీరు ఉంటారు. వీరికి స్వామి వారి హుండీలో పడిన నాణేలు అని తెలిస్తే మరింత సంతోషంగా తీసుకుంటారు. మేం పావలా నాణేలను టన్నుకు రూ.88 వేలు చెల్లించి తీసుకునేందుకు సిద్ధం.

Comment here