Sliderజాతీయ- అంతర్జాతీయ

​​​​ఐ లవ్‌ నరేంద్ర మోదీ: రాహుల్‌ గాంధీ

పుణె: ‘ఐ లవ్‌ నరేంద్ర మోదీ.. నాకు ఆయనపై ఎటువంటి ఆగ్రహం, ద్వేషం లేదు’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యలో మహారాష్ట్రలోని పుణెలో విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌ పాల్గొన్నారు. ‘నేను సత్యం ఆధారంగా పనిచేస్తాను. దాని నుంచే మానవత్వం పుట్టుకొస్తుంది.. మానవత్వం నుంచే ధైర్యం వస్తుంది. బలహీనవర్గాలైన రైతుల తరఫున నేను నిలబడతాను. కనీస ఆదాయ భరోసా పథకంలో భాగంగా పేదవారికి ఏడాదికి రూ.72,000 ఇస్తామంటూ మేము ఇచ్చిన హామీని నెరవేర్చుతాం. ప్రతిరోజు భారత్‌ 27,000 ఉద్యోగాలు రాకుండా కోల్పోతోంది. అనిల్‌ అంబానీ, మెహుల్ చోక్సీ వంటి వారి ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. వారు దేశంలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పటివరకు ఎంతమంది రుణాలను మాఫీ చేశారు? మన వ్యవస్థలో చాలా డబ్బు ఉంది. బ్యాంకులపై ఆధిపత్యం చెలాయించి కొందరు లబ్ధి పొందారు. తిరిగి ఆ డబ్బుని ఇవ్వలేదు. ఆ డబ్బుని ప్రజలకు అందేలా చేస్తే ఆ నగదు అంతా చలామణిలోకి వస్తుంది. మన ఆర్థిక స్థితి పురోగమిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

‘మేము అధికారంలోకి వస్తే పార్లమెంటు, విధాన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేలా కృషి చేస్తాం. అలాగే, 33 శాతం ఉద్యోగాలు మహిళలకు వచ్చేలా రిజర్వేషన్లు కల్పిస్తాం. పెద్దనోట్ల రద్దు చాలా ఘోరమైన ఆలోచన. మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు చూపింది. కోట్ల ఉద్యోగాలు కోల్పోయాం. మేము విద్య, ఆరోగ్య రంగాల్లో నిధులను పెంచుతాం. న్యాయ్‌ పథకం అమలు చేస్తే ఉద్యోగాలను కూడా సృష్టించవచ్చు. మన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించొచ్చు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్‌ జరిపిన దాడుల గొప్పదనం అంతా మన వైమానిక దళానిదే. ఈ దాడులను రాజకీయం చేయకూడదు. ఈ విషయంపై రాజకీయం చేస్తున్న ప్రధాని మోదీ పట్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. రాజకీయ నాయకుల వద్ద జవాబుదారీతనం ఉండాలి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం నాకు ఉంది. నాలా ప్రధాని మోదీ నిలబడి ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. నాకు ఆయనపై ద్వేషం, ఆగ్రహం లేదు.. ప్రేమ ఉంది’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Comment here