Slider2తెలంగాణ

యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు…

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు మంగళవారం సచివాలయంలో నెట్‌వర్క్ దవాఖానల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. సమస్యలు పరిష్కరిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల వారికి హామీఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు అంగీకరించారు. ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మంత్రి హామీపై సంతృప్తిచెందిన ఆసుపత్రి యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతున్నదని మంత్రి ఈటల తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు.

దేశానికే ఆరోగ్యశ్రీ పథకం రోల్‌మోడల్ అని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం వందరెట్లు గొప్పదని తెలిపారు. ఆయుష్మాన్‌భారత్ కేవలం 25 లక్షల కుటుంబాలకే వర్తించే అవకాశం ఉన్నదని, ఆరోగ్యశ్రీతో 85 లక్షల కుటుంబాలకు సేవలు అందుతున్నాయని వివరించారు. ప్రతినెలా విడుదల కావాల్సిన చెల్లింపులు ఆలస్యమవడంతో చిన్న దవాఖానలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు రూ.520 కోట్లు విడుతలవారీగా విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయేకాలంలో ప్రతినెలా కొంత మొత్తం చెల్లించాలని దవాఖానల యాజమాన్యాలు కోరాయని, తప్పకుండా అమలుచేస్తామని భరోసా ఇచ్చారు. 2007-12 మధ్యకాలంలోని ఎంవోయూలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తప్పకుండా పరిశీలిస్తామని స్పష్టంచేశారు. ఎంవోయూలను సులభతరం చేసేందుకు కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు.

Comment here