Sliderజాతీయ- అంతర్జాతీయ

మోదీ.. ‘భారతరత్న’ గ్రహీతను అవమానించారు

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా గుర్రుమంటూనే ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన  కార్యదర్శి ప్రియాంకా గాంధీతో సహా కాంగ్రెస్‌ సీనియర్లందరూ ఈ విషయంపై స్పందించారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్‌ ఈసీని ఆశ్రయించింది. తమ మనోభావాలు దెబ్బతినేలా మోదీ మాట్లాడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

‘ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకి రావు. ఆయన ఒక భారత రత్న అవార్డు గ్రహీతను అవమానించారు. మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. కాబట్టి బహిరంగ ర్యాలీల్లో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోండి’ అని ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఈసీకి లేఖ రాసింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ..రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మాట్లాడుతూ ‘‘మీ నాన్న ‘మిస్టర్‌ క్లీన్‌’ అని ఆయన సన్నిహితులే పొగిడారు. కానీ ఆయన జీవితం నంబర్‌ వన్‌ అవినీతిపరునిగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించారు. పదవి స్థాయిని దిగజార్చారంటూ ప్రముఖులు మోదీ వ్యాఖ్యలను ఖండించారు.

Comment here