జాతీయ- అంతర్జాతీయ

డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన క్రికెటర్‌

కొలొంబో: శ్రీలంక టెస్టు  క్రికెట్‌ కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయాడు. మద్యం తాగి, ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు కొలొంబోలో కారు నడిపి.. ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనం డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కరుణరత్నెను పోలీసులు అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. వారం రోజుల్లో అతడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అతడి వల్ల గాయాలపాలైన డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ అరెస్టుతో అతడి కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

కరుణరత్నె సారథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రీలంక అనూహ్య విజయాన్ని సాధించింది. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు కూడా కరుణరత్నె సారథ్య బాధ్యతలు వహించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. కరుణరత్నే ఇప్పటివరకు 60 టెస్టు మ్యాచులు ఆడి మొత్తం 4,074 పరుగులు సాధించాడు. అందులో 8 శతకాలు, 22 అర్ధశతకాలు ఉన్నాయి.

Comment here