Sliderఆంధ్రప్రదేశ్

ఆ బూత్‌లను సమస్యాత్మకంగానే గుర్తిస్తాం:ఈసీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 6న ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆయా పోలింగ్‌ బూత్‌లను సమస్యాత్మకంగానే పరిగణిస్తామని, పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు  సిద్ధంగా ఉంచనున్నట్టు చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బెల్‌ కంపెనీఇంజినీర్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువు 244 బూత్‌లో శాంతిభద్రతల సమస్యతలెత్తినందునే రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి 94వ బూత్‌లో ఈవీఎం మొరాయించిందన్నారు. ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ జరగదంటూ ఆర్వో ప్రకటించడంతో ఓటర్లు వెనుదిరిగారన్నారు. అలాగే, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కలనూతల 247 బూత్‌లో ఈవీఎం స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్లిందని, దీంతో సుమారు 50 మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్‌సిబ్బంది చేసిన పొరపాటు వల్ల రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇసుకపల్లి – పల్లెపాలెం పోలింగ్‌ బూత్‌ నెం 41, అటకాని తిప్ప 197 బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్టు ద్వివేది వివరించారు.

Comment here