CricketSliderక్రీడలు

ఆ ఒక్క తప్పే టీమిండియాను ముంచేసింది..!

 

చిన్నచిల్లు కూడా భారీ నౌకను ముంచేస్తుంది.. ఇదీ టీమిండియా ప్రాక్టికల్‌గా ప్రపంచ కప్‌లో నేర్చుకొన్న గుణపాఠం. అజేయ శక్తి.. హాట్‌ ఫేవరెట్‌.. ఎదురులేని జట్టు.. ఇలా ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు ఎన్నో కీర్తి కిరీటాలు ఉండేవి. కానీ, ప్రపంచ కప్‌లో భారత్‌ ఆటతీరు చూస్తే ఈ పొగడ్తలన్నీ నిజమేనా అనిపిస్తుంది.

భారత్‌ జట్టులోని క్రీడాకారులకు ప్రతిభకు వంకపెట్టేందుకు అవకాశమే లేదు. ఈ టోర్నీ మొత్తంగా చూసుకుంటే వారు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అర్థమవుతుంది. ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచుల్లో 4సార్లు స్కోర్‌ బోర్డును 300 దాటించారు. ఇది కొంచె ఘనంగా ఉండొచ్చు. కానీ, ఇటువంటి గణాంకాల మాయలోపడి టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌కు చోటు కల్పించలేదు. ఆల్‌ రౌండర్లు, వికెట్‌ కీపర్లతో ఇన్నింగ్స్‌ను నడిపిద్దామనుకుంది. సెమీస్‌ ఆడిన టీమిండియాను పేపర్‌ మీద చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నలుగురు వికెట్‌ కీపర్లు, ఇద్దరే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్లు, ముగ్గురు బౌలర్లు, ఇద్దరు ఆల్‌ రౌండర్లు ఉన్నారు. టి20 మూడు నుంచి సెలక్టర్లు ఇంకా బయటకు రాలేదేమో అన్న అనుమానం కలుగుతుంది.  వాతావరణంలో తేమ బౌలర్లకు అనుకూలిస్తుండగా 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేయాలన్న విషయాన్ని ఇక్కడ టీమిండియా ఎందుకు విస్మరించిందో అర్థం కాదు. ఆ సమయంలో మరో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అవసరం ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పలేము. సమతూకం లోపించిన జట్టు ఒత్తిడికి లోనైతే ఎలా కుప్పకూలుతుందో తెలుసుకోవడానికి నిన్నటి మ్యాచ్‌లో భారత ఆటతీరే ఉదాహరణ.
ఆత్మవిశ్వాసం అనొచ్చో.. అతి నమ్మకం అనొచ్చో కొన్నాళ్లుగా బ్యాటింగ్‌ భారం మొత్తాన్ని శిఖర్‌ ధావన్‌, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ భుజాన వేసుకొన్నారు. టీమిండియా ఈ ప్రపంచ కప్‌లో చేసిన మొత్తం పరుగులు 2516. అందులో 48.34శాతం ఈ ముగ్గురివే కావడం గమనార్హం. వీరికి కేఎల్‌ రాహుల్‌ కూడా జత కలిస్తే ఇది 68 శాతానికి చేరుతుంది. వీరిలో శిఖర్‌ రెండు మ్యాచ్‌ల తర్వాత గాయం కారణంగా వైదొలగాడు. విజయ్‌ శంకర్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మాయాంక్‌ అగర్వాల్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. శిఖర్‌ స్థానాన్ని వీరెవరూ సమర్థంగా భర్తీ చేయలేకపోయారు. పసికూన అఫ్గానిస్థాన్‌, వీర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచుల్లో మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యాలు భారత జట్టును హెచ్చరించాయి. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ  మహేంద్రుడు మాత్రం వికెట్ల వెనుక.. ముందు తన పోరాటాన్ని కొనసాగించాడు. కోహ్లీకి మార్గదర్శిగా..వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు మిడిల్‌ ఆర్డర్‌లో ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ పాత్ర పోషించాడు.

ఇక భారత్‌ కీలకమైన నిన్నటి మ్యాచ్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో ఎంపిక చేసిన దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు స్థిరంగా జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లు కాదు. వినోద్‌ కాంబ్లీ వంటి దిగ్గజమే సుదీర్ఘవిరామం తర్వాత జాతీయ జట్టులో వస్తే కుదురుకోవడానికి అవస్థలు పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇది బ్యాట్స్‌మన్‌ టెక్నిక్‌ సమస్య కాదు.. ఆత్మవిశ్వాసం సమస్య. ఆత్మవిశ్వాసం నిండిన జట్టును ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంలో సెలక్టర్లే విఫలమయ్యారని చెప్పాలి. ఇది ఛేదనలో బాగా ప్రభావం చూపుతుంది. భారత్‌ ఓడిపోయిన రెండు మ్యాచ్‌లు లక్ష్య ఛేదనలోనే కావడం దీనిని బలపరుస్తోంది.

గంభీర్‌ ఆవేశంతో అన్నాడో.. ఆలోచనతో అన్నాడో తెలియదు. కానీ, భారత్‌ జట్టును ఎంపిక చేసిన ఐదుగురు సెలక్టర్లు కలిపి 13 టెస్టు  మ్యాచ్‌లు.. దాదాపు 30 వన్డేలు మాత్రమే ఆడారు. ఇదీ వారి అంతర్జాతీయ టోర్నీల అనుభవం. ఫలితంగా జట్టులో కోచ్‌ నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు కోహ్లీ హవా కొనసాగుతోందనే అంశాన్ని  ఎవరూ కాదనలేరు. సాధన విషయంలో కఠినంగా ఉంటాడన్న పేరున్న కోచ్‌ కుంబ్లేను సాగనంపడంలో కోహ్లీ పాత్ర తెలియనిదికాదు. కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారి బంగారం లాంటి అవకాశాలను నేలపాలు చేస్తుందనటానికి నిన్నటే మ్యాచే ఉదాహరణ. రాయుడు ఉంటే టీమిండియా  గెలిచేస్తుందని చెప్పలేము.. మిడిల్‌ ఆర్డర్‌లో నాలుగో నెంబర్‌ స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ లోపం మాత్రం తీరేదేమో!

Comment here